టీమిండియా నయా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. జింబాబ్వే పర్యటనలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడని, అయినా పక్కన పెట్టడం ఏంది? అని ప్రశ్నిస్తున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలోనూ సంజూ శాంసన్‌కు ఇలానే అన్యాయం జరిగిందని, కొత్త కోచ్, కెప్టెన్ కూడా అతనికి అవకాశం ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను ఆడిన చివరి టీ20, వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా సంజూ శాంసన్‌ను తదుపరి మ్యాచ్‌లో ఆడించలేదని గుర్తు చేస్తున్నారు.

ఇది అన్యాయమని మండిపడుతున్నారు. జట్టులోకి తీసుకోవడమే చాలా తక్కువ అంటే.. బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పూర్తిగా బెంచ్‌కు పరిమితమైన సంజూ శాంసన్.. జింబాబ్వే పర్యటనలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దాంతో శ్రీలంకతో సిరీస్‌లో అతను తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ ప్రధాన వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఆడించడంతో సంజూ శాంసన్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది.
అంతేకాకుండా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడంతో సంజూ శాంసన్‌కు చోటు లేకుండా పోయింది. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్‌లను తుది జట్టులోకి తీసుకోలేదని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
అయితే రియాన్ పరాగ్‌ను తీసుకొని సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరాగ్ కంటే సంజూకు ఏం తక్కువని ప్రశ్నిస్తున్నారు. ఇదేం రాజకీయమని మండిపడుతున్నారు. జింబాబ్వే పర్యటనలో రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యాడని, అతని కంటే సంజూనే మెరుగ్గా రాణించాడని గుర్తు చేస్తున్నారు. అయితే ఎక్స్‌ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసమే రియాన్ పరాగ్‌ను తీసుకున్నట్లు అర్థమవుతోంది.
శ్రీలంకతో భారత్ తుది జట్టు: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్