వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్ మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్‌లో తన సిక్సర్ల మోతతో భారత అభిమానుల ప్రేమను సంపాదించుకున్న గేల్.. మరోసారి వారి అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ తరహాలో అలనాటి ఆటగాళ్లతో నిర్వహించనున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్)లో క్రిస్ గేల్ భాగమయ్యాడు.
ఐవీపీఎల్ అరంగేట్ర సీజన్‌లో బరిలోకి దిగేందుకు క్రిస్ గేల్ తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

ఈ టోర్నీలో ఆడేందుకు.. భారత అభిమానులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 'ఈ యూనీవర్స్ బాస్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దిగ్గజ ఆటగాళ్లతో పాటు అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. అరంగేట్ర వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నాడు. ఐవీపీఎల్ కోసం సిద్దంగా ఉండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్'అని గేల్ చెప్పుకొచ్చాడు.
తెలంగాణ టైగర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్న గేల్.. ఆ జట్టును సారథిగా నడిపించనున్నాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీతో పాటు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.
బోర్డ్ ఫర్ వెటరెన్ క్రికెట్ ఇన్ ఇండియా(బీవీసీఐ) ఆధ్వర్యంలో ఈ ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు డెహ్రాడూన్ వేదికగా జరగనుంది. క్రిస్ గేల్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు.
'ఐపీఎల్ తర్వాత ఆస్థాయిలో అత్యుత్తమ లీగ్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి వెటరన్ ప్లేయర్లతో ఈ లీగ్‌ను నిర్వహించనున్నాం. క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వా, సురేశ్ రైనా వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. భారత్‌లో వెటరన్ క్రికెట్‌కు ఈ టోర్నీ కొత్త శక్తినివ్వనుంది.'అని వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ త్యాగి తెలిపాడు.
ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పోటీపడనున్నాయి. రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, చత్తీస్‌గడ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు. ముంబై ఛాంపియన్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు.