
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. ఇక ఈ వాదనకు బలం చేకూరుస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం భారత్-పాక్ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. అయితే జమ్మూకశ్మర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఇద్దరిని చంపిన ముష్కరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినే టార్గెట్‌గా పెట్టుకుంటూ చంపేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలి'పేర్కొన్నారు.
పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ సైతం ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్నాడు. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలి. ఇరు దేశాలు ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం ఉత్తమం.'అని ఆయన చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదుల చేతిలో బలైన వ్యక్తి సోదరుడు సైతం ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ ద్వారానే టెర్రరిస్ట్‌లు జమ్మూలోకి అడుగుపెట్టారని, అమయాక ప్రజలను చంపుతున్నారని, పాకిస్థాన్‌తో ఎప్పుడు భారత్ క్రికెట్ ఆడవద్దని ఆవేదన వ్యక్తం చేశాడు.