మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎమ్‌పీఎల్)లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫీల్డర్ విసిరిన ఒక్కత్రోకు రెండు వైపుల ఉన్న స్టంప్స్ పడిపోయాయి. ఈ అరుదైన ఘటనకు ఎమ్‌పీఎల్ టోర్నీలోని రైగడ్ రాయల్స్, పుణేరి బప్పు మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్ శనివారం జరగగా.. ఆలస్యంగా ఈ రనౌట్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ప్రతిభావుంతులైన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణే వేదికగా ఎమ్‌పీఎల్ టోర్నీ నిర్వహిస్తుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రైగడ్ రాయల్స్, పుణేరి బప్పు జట్లు తలపడ్డాయి. పుణేరి బప్పు వికెట్ కీపర్ సూరజ్ షిండే వేసిన డైరెక్ట్ త్రో బ్యాటర్ ఎండ్ వికెట్లను పడేయడంతో పాటు నాన్‌స్ట్రైకర్ వైపు ఉన్న వికెట్లను కూడా పడేసింది. అతని త్రోకు రైగడ్ రాయల్స్ ఓపెనర్ హర్ష్ మొగవీర రనౌటై డకౌట్‌గా వెనుదిరిగాడు. పుణేరి బప్పు బౌలర్ సిద్దేష్ వీర్ వేసిన బంతిని మరో ఓపెనర్ రామకృష్ణ ఘోష్ లెగ్ సైడ్ డిఫెండ్ చేసి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు.

బంతిని చూసుకోకుండా క్రీజును ధాటాడు. నాన్‌స్ట్రైకర్ హర్ష్ మొగవీర అలర్ట్ చేయడంతో యూటర్న్ తీసుకున్నాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సూరజ్ షిండే గట్టిగా బ్యాటింగ్ ఎండ్‌వైపు ఉన్న వికెట్లను కొట్టాడు. వికెట్లను తాకిన బంతి.. నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ వైపు ఉన్న స్టంప్స్‌ను పడేసింది. రామకృష్ణ అలర్ట్ చేసిన హర్ష్ మొగవీర.. బంతి తనవైపు వస్తుండటాన్ని గమనించలేకపోయాడు. క్రీజులో బ్యాట్ పెట్టిన రామకృష్ణ బచాయించగా.. హర్ష్ మొగవీర రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ రనౌట్ అనంతరం రైగడ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో 203 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన రైగడ్ 103 పరుగులకు ఆలౌటైంది. వీర్(18), రుషభ్ రాథోడ్(21 బంతుల్లో 46) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుణేరి బప్పు 202 పరుగులు చేసింది.