Umran Malik: దేవుడా.. గంటకు 155 కి.మీ వేగంతో బౌలింగ్.. బుమ్రా రికార్డు బద్దలు! (వీడియో)

ముంబై: 'కుదిరితే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును అధిగమిస్తా. రికార్డులకన్నా జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం' శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలివి. అన్నట్లుగానే ఉమ్రాన్.. అక్షర్ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్(2/27) మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
మ్యాచ్‌ను మలుపు తిప్పి..
క్రీజులో పాతుకుపోయిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనకను ఫాస్టెస్ట్ డెలవరీతో బోల్తా కొట్టించాడు. అప్పటి వరకు భారీ షాట్లతో జట్టును విజయం వైపు నడిపిన షనక.. ఉమ్రాన్ ఫాస్టెస్ట్ డెలివరీకి తడబడ్డాడు. అంచనా వేయడంలో విఫలమై క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా..
భారత్ తరఫున అత్యధిక వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ రికార్డులను అధిగమించాడు. బుమ్రా గంటకు 153.36 కిలోమీటర్ల వేగంతో టాప్‌లో ఉండగా.. మహమ్మద్ షమీ (153.3 కిలోమీటర్లు), నవ్‌దీప్ సైనీ గంటకు 152.85 కిలోమీటర్ల వేగంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ ముగ్గుర్ని వెనక్కు నెట్టి ఉమ్రాన్ టాప్‌లో నిలిచాడు. ఉమ్రాన్ మాలిక్ వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా లైన్ లెంగ్త్‌ను కూడా చాలా మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

చెలరేగిన దీపక్ హుడా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.

షనక పోరాడినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications