క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఓ విచిత్రకర ఘటన అభిమానులను ఆకట్టుకుంటోంది. థర్డ్ అంపైర్ నాటౌటిచ్చిన తర్వాత కూడా ఆ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఫీల్డ్ అంపైర్ ఔటివ్వడం చర్చనీయాంశమైంది. ఆ వెంటనే తన తప్పిదం తెలుసుకొని నాలుక కరుచుకోవడంతో అక్కడ నవ్వులు పూసాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఈ విచిత్రకరన ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో అష్లేగార్డ్‌నర్ వేసిన ఆఖరి బంతికి సఫారీ బ్యాటర్ సున్ లూస్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసింది.

కానీ బంతిని అంచనా వేయడంలో ఆమె విఫలమవడంతో బ్యాట్‌ను మిస్సై ప్యాడ్లను తాకింది. దాంతో ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ క్లైర్ పోలోసాక్ నాటౌటిచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు రివ్యూ కెళ్లగా.. థర్డ్ అంపైర్ సూ రెడ్‌ఫర్న్ రివ్యూలను పరిశీలించి బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా బంతి వికెట్లను మిస్సవుతుందని గుర్తించి నాటౌటిచ్చింది.
ఒరిజినల్ డిసిషన్‌కు కట్టుబడాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించింది. అయితే క్లైర్ పోలోసోక్ మాత్రం థర్డ్ అంపైర్ సూచనలకు విరుద్దంగా ఔటిచ్చింది. ఆ వెంటనే తప్పిదం తెలుసుకొని నాటౌటివ్వడంతో అంతా నవ్వుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అంపైర్ గారూ నిద్రపోతున్నట్లున్నారని, ఏదో ఆలోచనలో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 34.1 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అన్నెక్ బోచ్(44), మరిజన్నే కాప్(46 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో అష్లే గార్డ్‌నర్ రెండు వికెట్లు తీయగా.. సదర్లాండ్, కిమ్ గార్త్, మేఘన స్కట్ తలో వికెట్ తీసారు.