కోహ్లీ X గంభీర్ గొడవ.. 13 ఏళ్ల తర్వాత స్పందించిన అంపైర్!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గొడవల గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి లేదు. 13 ఏళ్ల క్రితం ఐపీఎల్‌లో మొదలైన వీరి వైరం.. 2023 సీజన్ వరకు ఏదో రూపంలో కొనసాగింది. ఐపీఎల్ 2013 సీజన్‌లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు మైదానంలోనే గొడవపడిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో గంభీర్.. కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. కోహ్లీ ఆర్‌సీబీ సారథిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఔటైన వెంటనే గంభీర్ దూకుడుగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను నోరు జారగా.. పెవిలియన్ వైపు వెళ్తున్న కోహ్లీ ఒక్కసారిగా వెనుదిరిగి గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. అప్పటి ఢిల్లీ ఆటగాడైన రజత్ భాటియా ఈ ఇద్దర్నీ విడదీసాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది.

గొడవల్లేకపోతే మజా ఉండదు..
ఆ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించిన అనిల్ చౌదరి.. తాజాగా ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు. జియోస్టార్ 'చీకీ సింగిల్స్'షోలో నాటి గొడవను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఘటనలు లేకుంటే ఆటలో అసలు మజా ఉండదని అనిల్ చౌదరి అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉన్నా.. దుర్బుద్ది ఉండేది కాదని, తన తప్పు ఉంటే వెనక్కి తగ్గేవాడని చెప్పుకొచ్చాడు.
'కోహ్లీ-గంభీర్ గొడవ లాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఉత్తరాది ఆటగాళ్లు దూకుడుగా ఉంటారు. నేను కూడా లోకల్ క్రికెట్ ఆడాను. నా సహచర ఆటగాళ్లు కూడా ఇలానే ఉండేవారు. దూకుడుగా ఆడకపోతే.. వారి ప్రతిభ కూడా అంతగా బయటపడదు. ఆటగాళ్లను ఎక్కువగా కట్టడి చేస్తే ఆటలో అసలు మజా ఉండదు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని దాటకూడదు.
కోహ్లీలో దుర్బుద్ది ఉండదు..
విరాట్ కోహ్లీ నాకు చిన్ననాటి నుంచి తెలుసు. చిన్నతనం నుంచే అతని మ్యాచ్‌లకు నేను అంపైరింగ్ చేశాను. కాబట్టి అతని గురించి నాకు బాగా తెలుసు. అతనిలో ఎలాంటి దుర్బుద్ది ఉండేది కాదు. అతను కొన్నిసార్లు దూకుడుగా స్పందిస్తాడు. కానీ తన తప్పు ఉంటే వెనక్కి తగ్గి థమ్స్ అప్ కూడా ఇస్తాడు. ఓవర్ల మధ్యలో వచ్చి అంపైర్ల నడుము చుట్టూ చేయి వేస్తూ సరదాగా మాట్లాడుతాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. అతని లాంటి ఆటగాళ్లు లేకపోతే ఆట బోర్ కొడుతుంది.'అని అనిల్ చౌదరి చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత సరిగ్గా 10 ఏళ్లకు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మరోసారి గొడవపడ్డారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ అనంతరం లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం మరో లక్నో ప్లేయర్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.. ఆ జట్టు మెంటార్‌గా ఉన్న గంభీర్ అతన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఇద్దరిని విడదీసాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉండగా.. అతనితో కోహ్లీకి మాటలు లేవనే వార్తలు ఇటీవల హల్‌ఛల్ చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

