టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ముక్క లేనిదే ముద్ద దిగదని సహచర బౌలర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు. మహమ్మద్ షమీ ఏదైనా భరిస్తాడని, కానీ మటన్ లేకుండా ఉండలేడని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ షమీ.. గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి సారిగా ఆడిన షమీ.. రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. గాయంతోనే వన్డే ప్రపంచకప్‌లో కొనసాగిన షమీ.. అనంతరం పలు సర్జరీలు చేసుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు.

ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన షమీ.. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేశ్ యాదవ్.. షమీ డైట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మహమ్మద్ షమీ దేన్నైనా భరిస్తాడు. కానీ నాన్‌వెజ్ లేకుండా ఉండలేడు. మటన్ తినకుండా ఒక్క రోజు ఉండగలడేమో. కానీ రెండో రోజు అతనిలో ఆందోళన కనిపిస్తోంది. మూడో రోజుకు బౌలింగ్‌పై నియంత్రణ కూడా కోల్పోతాడు. ముక్క లేకుంటే అతని బౌలింగ్ వేగం 15 కిలోమీటర్లు తగ్గిపోతుంది.'అని ఉమేశ్ యాదవ్.. సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మహమ్మద్ షమీ.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. మెగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నాటికి మహమ్మద్ షమీ అందుబాటులోకి వస్తాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పలువురు గాయాలతో బాధపడుతున్నారు. వారంతా తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నా. మహమ్మద్ షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించడం శుభపరిణామం. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నా.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.