యూఏఈ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచి తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన యూఏఈ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40), జకెర్ అలీ(34 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 41), హసన్ మహ్ముద్(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 26 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ(3/7) మూడు వికెట్లు తీయగా.. మటిల్లా ఖాన్, సఘిర్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. అకిఫ్ రాజా, ధ్రువ్ పరషార్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం యూఏఈ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. అలిషన్ షరఫు(47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. అసిఫ్ ఖాన్(26 బంతుల్లో 5 సిక్స్‌లతో 41 నాటౌట్) పర్వలేదనిపించాడు. యూఏఈ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొస్సేన్ తలో వికెట్ తీసారు.
ఈ విజయంతో టెస్ట్ హోదా కలిగిన జట్టుపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన జట్టుగా యూఏఈ చరిత్ర సృష్టించింది. మరోవైపు బంగ్లాదేశ్ అప్రతిష్టను మూటగట్టుకుంది. యూఏఈ చేతిలో ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయిన తొలి టెస్ట్ నేషన్‌గా చెత్త రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకుంది.