
న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ భారత్ ఐదో సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి మరీ టైటిల్ అందుకుంది. విజేతగా నిలిచి యువ భారత్.. జట్టులోని ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. టోర్నీ ఆసాంతం అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ రవికుమార్.. ఫైనల్లో (4/34) సూపర్ స్పెల్ వేశాడు.
ఇక రవి కుమార్ ప్రదర్శనపై అతని తండ్రి రజిందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ అయిన రజిందర్ సింగ్.. దేశం కోసం బుల్లెట్లు కాలిస్తే.. తన కొడుకు వికెట్లు తీస్తున్నాడని తెలిపాడు. 'మేం బుల్లెట్లతో దేశ రక్షణ కోసం పని చేస్తున్నాం. నా కుమారుడు అతని బౌలింగ్‌తో టీమిండియాకు సేవలందిస్తున్నాడు' అని తెలిపారు. ప్రస్తుతం రజిందర్ సింగ్ ఒడిశాలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన రాయగడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒడిశాకు రాకముందు శ్రీనగర్‌లో రజిందర్ సింగ్ విధులు నిర్వర్తించారు. తన జీవితంలో ఎక్కువగా మిలిటెంట్ల రీజియన్లలోనే గడిపానని, అయితే తన భార్య, ముగ్గురు పిల్లలు ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గతంలో ఓ సంఘటన గురించి రజిందర్ సింగ్ గుర్తుకు తెచ్చుకున్నారు. 2006లో శ్రీనగర్‌లో విధుల్లో ఉండగా మిలిటెంట్ల దాడి జరిగిందని, అందులో ఒకరు మృతి చెందగా..తనతో సహా పదకొండు మంది సైనికులు గాయపడ్డారని పేర్కొన్నారు.
అప్పుడు రవికుమార్ చాలా చిన్నవాడని, తన కష్టాలను ఎప్పుడూ కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించలేదని, తీవ్రంగా గాయపడిన విషయాన్ని కూడా చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. 'ఎల్లప్పుడూ నా కుటుంబ సభ్యులను సంతోషంగా ఉండేలా చూసుకున్నా. నేను అనుభవించిన బాధలను వారికి తెలియకుండా జాగ్రత్త పడేవాడిని. ఉగ్రదాడిలో కాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడినా దాని గురించి వారికి చెప్పలేదు. టీవీలో చూసిన తర్వాతే వారంతా నా గాయాల గురించి తెలుసుకున్నారు'అని రజిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.