అండర్ 19 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరింది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. శనివారం ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. అరఫత్ మిన్‌హాస్(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), షెహ్‌జైబ్ ఖాన్(67 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రోహనత్, షేక్ జిబాన్ నాలుగేసి వికెట్లు తీయగా.. రెహ్మాన్ రబ్బీ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షిహాబ్ జేమ్స్(26), రోహనత్(21 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
పాకిస్థాన్ బౌలర్లలో ఉబైద్ షా(5/44) ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. అసాధారణ బౌలింగ్‌తో పాక్‌కు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. అతనికి తోడుగా అలి రాజా మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ జీషాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ విజయంతో పాకిస్థాన్ నాలుగో జట్టుగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి.
మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు తలపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
గ్రూప్-1లో భారత్, పాక్ జట్లు నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలవగా.. గ్రూప్-2లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
ఆస్ట్రేలియాపై పాకిస్థాన్.. సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఫైనల్లో దాయాదీ దేశాలు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే భారత్ X పాక్ ఫైనల్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. లీగ్ దశలో ఇరు జట్లు తలపడలేదు.