అండర్ 19 ప్రపంచకప్ 2026లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్స్ వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్ర విధ్వంసం కొనసాగుతోంది. సూపర్ సిక్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విహాన్ మల్హోత్రా(107 బంతుల్లో 7 ఫోర్లతో 109 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు.
అభిజ్ఞాన్ కుండు(62 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) మరోసారి నిరాశపర్చాడు. జింబాబ్వే బౌలర్లలో తటెండా చిముగోరో మూడు వికెట్లు తీయగా.. సింబరాషే ముడ్జెంగెరెరే, పనాషే మజాయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మజాయ్ బౌలింగ్‌లో ఆరోన్ జార్జ్(23) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. తొలి వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో భారత్ 10.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.
ప్రమాదకరంగా మారిన ఈ జోడిని చిముగోరో విడదీసాడు. ఒకే ఓవర్‌లో ఆయుష్ మాత్రే(21)తో పాటు వైభవ్ సూర్యవంశీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వేదాంత్ త్రివేది(15)కూడా నిరాశపర్చడంతో భారత్ 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుండు జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పింది. 48 బంతుల్లో కుండు, 57 బంతుల్లో మల్హోత్ర హాఫ్ సెంచరీలు సాధించారు. అభిజ్ఞాన్ కుండు ముడ్జెంగెరెరే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి ఐదో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తన మరుసటి ఓవర్‌లో కన్షిక్ చౌహన్(3)ను ముడ్జెంగెరెరే పెవిలియన్ చేర్చాడు.
ఆర్‌ఎస్ అంబ్రిష్ సాయంతో జట్టు స్కోర్‌ను 300 ధాటించిన విహాన్.. 104 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో ఖిలాన్ పటేల్ మూడు సిక్స్‌లు, బౌండరీతో మెరుపులు మెరిపించాడు. దాంతో భారత్ 350 పరుగుల మార్క్ అందుకుంది.