అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. సూపర్ సిక్సెస్ గ్రూప్-2లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత అండర్ 19 జట్టు 204 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.
బ్యాటింగ్‌లో విహాన్ మల్హోత్ర సెంచరీతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బౌలింగ్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే(3/14)తో పాటు ఉధమ్ మోహన్(3/20) తీన్మార్ బౌలింగ్‌తో జింబాబ్వే పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా(107 బంతుల్లో 7 ఫోర్లతో 109 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. వైభవ్ సూర్యవంశీ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52), అభిజ్ఞాన్ కుండు(62 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) మరోసారి నిరాశపర్చాడు. జింబాబ్వే బౌలర్లలో తటెండా చిముగోరో మూడు వికెట్లు తీయగా.. సింబరాషే ముడ్జెంగెరెరే, పనాషే మజాయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ధ్రువ్ పటేల్ ఒక వికెట్ దక్కింది.

అనంతరం జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో లిరోయ్ చివావులా(77 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్ చేసిన 352 పరుగుల్లో జింబాబ్వే సగం కూడా చేయలేకపోయింది. భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుష్ మాత్రే మూడు వికెట్లు తీయగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో వికెట్ తీసారు.
సూపర్ సిక్స్ గ్రూప్-2లో భారత్ మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లకు రెండు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.