Mahboob Khan: పవర్ ప్లేలోనే భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ అండర్ 19 కెప్టెన్ మహబూబ్ ఖాన్ అన్నాడు. బౌలర్లు కూడా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారని, దాంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని చెప్పాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
310 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ కాపాడుకోలేకపోయింది. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ సూర్యవంశీ, 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆరోన్ జార్జ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను అఫ్గాన్ ఫీల్డర్లు వదిలేసారు. దాంతో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆరోన్ జార్జ్(104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115)సెంచరీతో కదం తొక్కాడు. దాంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అఫ్గాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్.. ఈ తప్పిదాలతోనే 310 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ టోర్నీలో తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. ' 310 పరుగులు మంచి స్కోర్. కానీ తొలి పవర్ ప్లేలో మేం రెండు క్యాచ్‌లు వదిలేసాం. బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు. అందుకే మేం మ్యాచ్ ఓడిపోయాం. ఈ రోజు మా బ్యాటింగ్ చాలా బాగుంది. 310 పరుగులు చేయడం అనేది చాలా పెద్ద స్కోర్. కానీ ఈ రోజు మాకు కలిసిరాలేదు.
ఫైసల్ అద్భుతమైన ఆటగాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేశాడు. నియాజై కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ అల్లా దయంతో ఫైసల్ భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అతను చాలా కష్టపడుతాడు. భవిష్యత్తులో అతను తప్పకుండా గొప్ప ఆటగాడు అవుతాడు. ఉదయం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఏం మారలేదు. బౌలర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఇది పెద్ద స్కోరే. కానీ ఈ రోజు మాకు కలిసిరాలేదు. ఈ టోర్నీలో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేం సెమీ ఫైనల్ చేరడానికి చాలా కష్టపడ్డాం. అందుకు కెప్టెన్‌గా నేను గర్వపడుతున్నాను.'అని మహబూబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.