
నార్త్ సౌండ్: అండర్-19 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌కు నిరాశే ఎదురైంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన దాయాదీ జట్టు కీలక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ప్రతీ టోర్నీలో తమకు అడ్డుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా చేతిలోనే మళ్లీ పరాజయం పాలైంది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 119 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 276 పరుగులు చేసింది. టీగ్ విల్లీ(97 బంతుల్లో 8 ఫోర్లతో 71), కోరి మిల్లర్(75 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా... క్యాంప్‌బెల్ కెల్లావె(47), కూపర్ కొనొల్లి(33), విలియమ్ సల్జ్మన్(25) ఫర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో కాసీమ్ అక్రమ్ మూడు వికెట్లు తీయగా.. అవైస్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. జీసాన్ జమీర్, మెహ్రాన్ ముంతాజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
277 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 35.1 ఓవర్లలో 157 పరుగలకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మెహ్రన్ ముంతాజ్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29), అబ్దుల్ ఫసీహ్(28), ఇర్ఫాన్ ఖాన్( 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో విలియమ్ సల్జ్మన్ మూడు వికెట్లు తీయగా.. టామ్ వైట్నీ జాక్ సినీఫీల్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జాక్ నిస్బెట్ ఓ వికెట్ దక్కింది.
కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియానే కళ్లెం వేసిన విషయం తెలిసిందే. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు చేరిన పాక్‌కు రెండో సెమీ ఫైనల్‌లో ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది.