U19 World Cup 2020 Quarterfinal: ఆసీస్ చిత్తు.. సెమీస్‌కు యువ భారత్

పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): కార్తీక్ త్యాగి (4/24), ఆకాష్ సింగ్(3/30) విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో యువభారత్ ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యంగ్ ఇండియా 74 పరుగులతో గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(62), లోయరార్డర్ బ్యాట్స్‌మన్ అధర్వ అంకోలేకర్(55) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కోరీ కెల్లీ, టాడ్ ముర్ఫే తలో రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ విల్లన్, కొన్నార్ సుల్లే, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ సామ్ ఫెన్నింగ్ (75) ఒంటిరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్ల ధాటికి సామ్, లియమ్ స్కాట్(35), పాట్రిక్ రో(21) మినహా ఇతర బ్యాట్స్‌మన్ రెండెంకెల స్కోర్ చేయలేదు.

సున్నాకే వికెట్..
234 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న ఆ జట్టు ఓపెనర్ జేస్ ఫ్రాక్ మెక్‌గ్రక్ ఒక్క బంతి కూడా ఆడకుండానే జలజ్ సక్సెనా అద్భుత త్రోకు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మెకంజీ హార్వే ఫోర్‌తో ఖాతా తెరిచినా ఆ మరుసటి బంతికే ఎల్బీ డబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన లాచ్లన్ హీర్న్‌ను కార్తీక్ త్యాగి బౌల్డ్ చేశాడు. దీంతో లాచ్లన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన ఒలివర్ డెవిస్ హ్యాట్రిక్ బాల్‌ను జాగ్రత్త ఆడి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కార్తీక్ త్యాగి దెబ్బకు ఆసీస్ తొలి ఓవర్‌లోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతర తన మరుసటి ఓవర్‌లో కార్తీక్ త్యాగి ఒలివర్ డెవిస్(2)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

పోరాడిన సామ్ ఫెన్నింగ్..
17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో ఉన్నజట్టును ఓపెనర్ సామ్ ఫెన్నింగ్ ఆదుకున్నాడు. క్రీజులోకి వచ్చిన పాట్రిక్ రోతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీని కార్తీక్ త్యాగిని విడదీసి మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 51 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లియమ్ స్కాట్‌తో సామ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 101 బంతుల్లో సామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వేగం పెంచిన ఈ జోడి అంకేలకర్ వేసిన 34 ఓవర్లలో ఫోర్, సిక్స్‌తో విరుచుకుపడింది. 38 ఓవర్‌లో సామ్ సిక్సర్ బాదగా.. 40 ఓవర్‌లో స్కాట్ సిక్సర్ కొట్టాడు. అయితే రవి బిష్ణోయ్ వేసిన 41 ఓవర్ తొలి బంతికి స్కాట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

వరుసగా మూడు వికెట్లు..
లెఫ్టార్మ్ పేసర్ ఆకాష్ సింగ్ 42 ఓవర్‌లో అద్భుతం చేశాడు. హాఫ్ సెంచరీ హీరో సామ్ ఫెన్నింగ్(75), సంఘ(5), ముర్ఫి(0) వరుసగా ఫెవిలియన్ చేరారు. సంఘ ఒక్కడు రనౌటవ్వగా.. మిగతా ఇద్దరు క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. తన మరుసటి ఓవర్లోనే విలియన్స్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ గెలిచింది.

ఆదుకున్న జైస్వాల్..
టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టుకు ఆసీస్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది.
జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా(14) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(2), కెప్టెన్ ప్రియమ్ గార్గ్(5), ధ్రువ్ చంద్(15) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. రవి బిష్ణోయ్(30), అధర్వ అంకోలేకర్(55) పరుగులతో రాణించి ఏడో వికెట్‌కు 60కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా టీమిండియా 233 పరుగులు చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications