
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ అదరగొట్టింది. టైటిల్ ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యంగ్ ఇండియా సగర్వంగా ఫైనల్ చేరి నయాచరిత్ర సృష్టించింది.
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఓవరాల్‌గా ఇది ఏడోసారి కాగా.. వరుసగా మూడో సారి కావడం విశేషం. ఇక ఈ ఏడాది ఓటమెరుగని యువ భారత్‌కు వరుసగా ఇది తొమ్మిదో విజయం కాగా.. అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా 11వ గెలుపు కావడం మరో విశేషం. దాయాదీ పాకిస్థాన్‌పై 2014 జనవరి నుంచి వరుసగా భారత్ ఐదో విజయాన్నందుకుంది. అండర్-19 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో 10 వికెట్లతో నెగ్గిన తొలి జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్(113 బంత్లులో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు.. దివ్యాన్ష్ సక్సెనా (99 బంతుల్లో 6 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో చేలరేగడంతో దాయదీ పాక్ చిత్తయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ హైదర్ అలీ(56), కెప్టెన్ నజీర్(62), మహ్మద్ హారీస్(21) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా(3/28) మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అథర్వ అంకోలేకర్, యశస్వీ జైస్వాల్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 173 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 176 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.