
సెంచూరియస్: ఐసీసీ మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలందుకున్న షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు సూపర్-6కు అర్హత సాధించింది. బుధవారం స్కాట్లాండ్ తో జరిగిన గ్రూప్ -ఢీ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత అమ్మాయిలు.. 85 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్నారు. తెలంగాణ అమ్మాయి.. గొంగడి త్రిష(51 బంతుల్లో 6 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ షెఫాలీ వర్మ విఫలమైనా.. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సూపర్ ఫిఫ్టీతో భారత్‌ను ఆదుకుంది. ఆమెకు తోడుగా రిచా ఘోష్(33), శ్వేతా షెరావత్(10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. అనంతరం స్కాట్లాండ్.. 66 పరుగులకే కుప్పకూలింది. స్కాంట్లాడ్ బ్యాటర్లలో డెర్సీ కార్టర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్లో మనత్ కశ్యప్ నాలుగు వికెట్లు తీయగా.. అర్చనా దేవి మూడు వికెట్లు పడగొట్టింది. సోనమ్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
తొలి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన షఫాలీ వర్మ (1) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్ (35 బంతుల్లో 22, 3 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు తెలంగాణ అమ్మాయి త్రిష 70 పరుగులు జోడించింది. అయితే 17వ ఓవర్లో భారత్‌కు డబుల్ స్ట్రోక్ తాకింది. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న త్రిష తో పాటు రిచా కూడా కాథరీన్ ప్రేసర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. చివర్లో వచ్చిన శ్వేతా షెహ్రావత్.. 10 బంతుల్లోనే 4 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లు బాది 31 పరుగులు చేసింది. దాంతో స్కాట్లాండ్ ముందు పోరాడే లక్ష్యం నమోదైంది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్.. తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను రెండో మ్యాచ్‌లో యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించింది.