
కూలిడ్జ్: వెస్టిండీస్, పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో విచిత్రం చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ప్లేయర్లు చినెల్లే హెన్రీ, చెడీన్ నేషన్ ఉన్నట్లుండి ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలడం ఆందోళన కలిగించింది. అది కూడా 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరూ ప్లేయర్లు స్పృహ తప్పిపడిపోవడం భయబ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుతం ఈ విచిత్రకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు విషయం ఏంటంటే.. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య కూలిడ్జ్ వేదికగా శుక్రవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసింది.
అనంతరం పాకిస్థాన్ లక్ష్యచేధనకు దిగగా.. నాలుగో ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను వెంటనే ఫిజియో సాయంతో స్ట్రెచర్‌పై మైదానం బయటకు పంపించగా.. మరో 10 నిమిషాల వ్యవధిలోనే నేషన్ కూడా కుప్పకూలింది. ఆమెను కూడా స్ట్రెచర్‌పై మైదానం బయటకు పంపి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు పడిపోవడానికి గల కారణం ఇప్పటికి తెలియరాలేదు. కానీ ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని విండీస్ క్రికెట్ బోర్డు ఓప్రకటనలో పేర్కొంది.
ఈ మ్యాచ్‌లో విండీస్ మహిళలు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగులతో విజయం సాధించారు. 126 పరుగుల లక్ష్యచేధనకు దిగిన పాక్ మహిళలు 18 ఓవర్ల ఆట పూర్తయ్యాక వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాక్ 6 వికెట్లకు 103 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం విండీస్‌ను విజేతగా ప్రకటించారు. 18 ఓవర్లలో 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. పాక్ 103 పరుగులే చేయడంతో విండీస్ విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో విండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.