
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు టీనేజ్ క్రికెటర్లు పిడుగు పడి మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆ దేశ క్రికెట్‌లోకాన్ని శోకసంధ్రంలో ముంచింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢాకాకు చెందిన మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మాన్ గురువారం స్థానిక మైదానంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. వర్షం కారణంగా వారి క్రికెట్ సన్నాహకాలకు ఆటంకం ఏర్పడటంతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఇంతలో వారిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ఓ టోర్నీ ట్రయల్స్ కోసం నదీమ్, రెహ్మాన్ ప్రాక్టీస్ చేస్తున్నారని వారి కోచ్ అన్వర్ హుస్సెన్ అన్నారు. ఆ టోర్నీలో రాణించి బంగ్లాదేశ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్నారని, కానీ పిడుగు వారి ప్రాణాలను తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక బంగ్లాదేశ్‌లో ప్రతీ ఏడాది పిడుగులు పడి వందల మంది మరణిస్తుంటారు. ముఖ్యంగా వర్షకాలం(ఏప్రిల్ నుంచి అక్టోబర్)లో ఈ మరణాలు అక్కడ సర్వ సాధారణం. ప్రతీ ఏటా సుమారు 350 మంది పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. బంగ్లాదేశ్ విపత్తు శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. 2016 మే నెలలో పిడుగుల కారణంగా ఒకే రోజు 82 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 350 మంది మరణించారు.