ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) 2025 సీజన్ టైటిల్‌ను తుంగభద్ర వారియర్స్ సొంతం చేసుకుంది. శనివారం రాత్రి విశాఖపట్నం వేదికగా జరిగిన ఫైనల్లో అమరావతి రాయల్స్‌ను 5 వికెట్ల తేడాతో మహీప్ కుమార్ సారథ్యంలోని తుంగభద్ర వారియర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమరావతి రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది.
కెప్టెన్ హనుమ విహారి(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎం ప్రణీత్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడాడు. తుంగభద్ర బౌలర్లలో శశికాంత్(3/37) మూడు వికెట్లు తీయగా.. స్టీఫెన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. సిద్దార్ధకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం తుంగభద్ర వారియర్స్ 18 ఓవర్లలోనే 5 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. జ్ఞానేశ్వర్(45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), గుట్టా రోహిత్(28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. దత్తా రెడ్డి(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) దూకుడుగా ఆడాడు. అమరావతి బౌలర్లలో బండారు అయ్యప్ప(2/44), హనుమ విహారి(2/42) రెండేసి వికెట్లు తీయగా.. వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.
విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్‌కు రూ. 35 లక్షలు, రన్నరప్ అమరావతి రాయల్స్‌కు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. టైటిల్ ప్రజంటేషన్ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
ఆరెంజ్ క్యాప్- అశ్విన్ హెబ్బర్(315 పరుగులు)
పరుప్పుల్ క్యాప్- సత్యనారయణ రాజు(14 వికెట్లు)
ఎమర్జింగ్ ప్లేయర్- టీవీ సాయి శ్రవణ్
ప్లేయర్ ఆఫ్ ది సీజన్- హనుమ విహారి
పవర్ ఫుల్ స్ట్రైకర్స్- జహీర్ అబ్బాస్
ఫెయిర్ ప్లే అవార్డ్- భీవమరం బుల్స్