సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా.. ఆఖరి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించింది. ఆసీస్ టాప్-3 బ్యాటర్లు ట్రావిస్ హెడ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142), మిచెల్ మార్ష్(106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), కామెరూన్ గ్రీన్(55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 431 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ త్రయానికి తోడుగా అలెక్స్ క్యారీ(37 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, సీనరన్ ముత్తుసామీ తలో వికెట్ తీసారు.
ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యధిక స్కోర్. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 434/4 పరుగులు చేసిన ఆసీస్.. తాజా మ్యాచ్‌లో 431/2 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 250 పరుగులు జోడించారు. తద్వారా వన్డేల్లో సౌతాఫ్రికాపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచింది. ఈ క్రమంలో 22 ఏళ్ల ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ ఇద్దరూ 2003లో సౌతాఫ్రికాపై తొలి వికెట్‌కు 200 పరుగులు జోడించారు.
సౌతాఫ్రికాపై ఒక వన్డే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ జోడీగా మార్ష్-హెడ్ నిలిచారు. ఈ ఇద్దరి కంటే ముందు సచిన్-గంగూలీ, సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ ఈ ఫీట్ సాధించారు. సౌతాఫ్రికాపై ఆసీస్ తరఫున అత్యథిక స్కోర్ సాధించిన మూడో ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్(142) నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వార్నర్ 173 పరుగులు చేశాడు.