
మెల్‌బోర్న్: అప్పుడెప్పుడో.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'చూడాలని ఉంది' చిత్రంలోని ఓ పాటలో గంగూలీ సంధులో గజ్జెల గోల అని విన్నాం. ఆ మూవీ టైమ్‌లో గంగూలీ ప్రభావం అంతగా ఉండటం.. సినిమా కూడా బెంగాల్‌లో తీయడంతో అలా ఆ లైన్‌ను వాడారు. క్రికెట్‌ను ఆరాధ్య దైవంగా భావించే భారత్‌లో గల్లీలకు ఇలా క్రికెటర్ల పేర్లు పెట్టుకోవడం సహజమే.కానీ ఆస్ట్రేలియాలో ఈ కాలంలో అది కూడా భారత క్రికెటర్ల పేర్లను తమ వీధులకు పెట్టుకుంటున్నారు.
మెల్‌బోర్న్‌లో రాక్‌బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లోని గల్లీలకు 'టెండూల్కర్ డ్రైవ్', 'కోహ్లీ క్రెసెంట్', 'దేవ్ టెర్రెస్' అని పేరుపెట్టుకున్నారు. రాక్‌బ్యాంక్ ప్రాంతం మెల్టన్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో భారత్‌కు చెందిన వారు ఇళ్లని ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు. భారత క్రికెటర్లతో పాటు ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్ల పేర్లు కూడా ఎస్టేట్‌లోని వీధులకి పెట్టారు.
వా స్ట్రీట్, మియాందాద్ స్ట్రీట్, అంబ్రోస్ స్ట్రీట్, సొబెర్స్ డ్రైవ్, కలిస్ వే, హాడ్లీ స్ట్రీట్, అక్రమ్ వే అని పెట్టారు. ఇలా క్రికెటర్ల పేర్లు పెట్టడంతో భారతీయుల నుంచి భారీ స్పందన వస్తుందని, అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్టేట్ నిర్వహణాధికారి ఒకరు తెలిపారు.
ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర పేర్లను ప్రతిపాదించగా కొన్ని కారణాలతో అనుమతి లభించలేదని పేర్కొన్నారు. కోహ్లీకి వీరాభిమానని, ఖరీదైన ప్రాంతానికి అతడి పేరుని పెట్టినట్లు తెలిపారు. ఎస్టేట్ నిర్వాహణాధికారుల ప్రతిపాదించిన వీధి పేర్లను సిటీ కౌన్సిల్ ఆమోదిస్తుంది. ఇక భారత ఆటగాళ్ల పేర్లు విదేశాల్లో వీధులకు పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో సునీల్ గావస్కర్ పేరు న్యూజిలాండ్‌లోని ఓ వీధికి పెట్టుకున్నారు.