న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. టైటిల్ స్పాన్సన్ టాటా గ్రూప్‌తో కలిపి ప్లే ఆఫ్స్‌లో బౌలర్లు వేసే ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలతో పాటు అదనంగా 50 వేల మొక్కలను నాటుతామని వెల్లడించింది. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని, చాలా మంది పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో జనాల్లో మార్పు తేవాలానే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీసీసీఐ వెల్లడించింది. గత సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియగా.. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లో కలిపి మొత్తం 292 డాట్ బాల్స్ నమోదయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్ బాల్స్ నమోదవ్వగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 96 డాట్ బాల్స్ వేసారు.
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్ వేయగా.. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 45 డాట్ బాల్సే నమోదయ్యాయి. గుజరాత్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు వర్షం కారణంగా సీఎస్‌కే ఇన్నింగ్స్ 15 ఓవర్లకు కుదించడంతో ఫైనల్లో తక్కువ డాట్ బాల్స్ నమోదయ్యాయి.
292 డాట్ బాల్స్ నమోదవ్వడంతో బీసీసీఐ 292 X 500 లెక్కన మొత్తం 1,46000 మొక్కలతో పాటు అదనంగా 50 వేలు అంటే 196000 మొక్కలను నాటనుంది. ప్లే ఆఫ్స్‌లో డాట్ బాల్స్‌ను ఎక్కువగా ఆకాశ్ మధ్వాల్, మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, మతీశా పతీరణలే వేసారు. పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ చేపట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.