
న్యూఢిల్లీ: మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రారాజుగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యధికంగా సంపాదించే టాప్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ.. తాజాగా అత్యధిక వార్షిక ఆదాయం అందుకుంటున్న క్రికెటర్‌గా నిలిచాడు. స్పోర్ట్‌నైల్ సంస్థ వివరాల ప్రకారం విరాట్ కోహ్లీ సంవత్సరానికి రూ. 208.56 కోట్లు ఆర్జిస్తున్నాడు. 2021 వార్షిక ఆదాయం ఆధారంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ -10 క్రికెటర్ల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది.
ఈ జాబితాలో మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. ఈ లిస్ట్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.108.28 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ రూ. 74.49 కోట్లు మూడో స్థానంలో ఉండగా.. బెన్ స్టోక్స్(రూ. 60 కోట్లు), హార్దిక్ పాండ్యా(59.9 కోట్లు), స్టీవ్ స్మిత్(55.86 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (రూ.31.65 కోట్లు), ఏబీ డివిలియర్స్ (రూ.22.50 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ.22.40 కోట్లు), సురేశ్ రైనా(రూ.22.24 కోట్లు)తో వరుసగా ఉన్నారు. ధోనీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా వారి సంపాదన ఏ మాత్రం తగ్గలేదు.
ఐపీఎల్ కాంట్రాక్టులు, ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు, దేశ క్రికెట్ కాంట్రాక్టులు, సోషల్ మీడియా ఆధాయం అన్ని కలుపుకొని స్పోర్ట్‌నైల్ సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. ఇక కోహ్లీ ఒక్క పుమా సంస్థ నుంచే రూ.100 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా ఒక ప్రమోషనల్ పోస్ట్‌కు రూ. 5 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇవే కాకుండా పలు బ్రాండ్ల ద్వారా ధోనీ కన్నా రెండు రెట్లు, రోహిత్ శర్మ కన్నా మూడు రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడు.
మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా సంపాదించే ఆదాయంతోనే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సురేశ్ రైనాకు రూ.11 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టు ఉండగా.. ప్యాట్ కమిన్స్‌కు రూ. 15 కోట్లు కాంట్రాక్ట్ ఉంది. హార్దిక్ పాండ్యా సైతం సోషల్ మీడియా, పలు బ్రాండ్ల ఒప్పందాలతో బానే సంపాదిస్తున్నాడు.