Tom Latham: చివరి 10 ఓవర్లలో ధాటిగా పరుగులు చేయకపోవడం తమ ఓటమికి కారణమైందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో కివీస్‌కు ఇదే తొలి పరాజయం.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన టామ్ లాథమ్.. ఇంకొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. టీమిండియా అద్భుతంగా ఆడిందని అభినందించాడు. 'ఈ రోజు మేం బాగానే ఆడాం. కానీ బ్యాటింగ్‌లో చివరి 10 ఓవర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది.

బంతితో కూడా మేం డబుల్ బ్రేక్‌త్రూ అందుకోలేకపోయాం. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి 10 ఓవర్లలో మాకు ధాటిగా ఆడే పరిస్థితులను కల్పించారు. మాది పర్‌ఫెక్ట్ టీమ్. రచిన్, డారిల్ అసాధారణ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా డారిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇతరులు స్వేచ్చగా ఆడే పరిస్థితి కల్పించాడు. ఈ మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ.. టీమిండియా మా కన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. తదుపరి మ్యాచ్‌కు మాకు చాలా సమయం ఉంది. బలంగా పుంజుకోవడంపై ఫోకస్ పెడుతాం.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130), రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/54) ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రోహిత్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), రవీంద్ర జడేజా(44 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.