
రాయ్‌పూర్: చెత్త బ్యాటింగే భారత్‌తో రెండో వన్డేలో తమ కొంపముంచిందని న్యూజిలాండ్ తాత్కలిక సారథి టామ్ లాథమ్ అన్నాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారని తెలిపాడు. అవసరమైన భాగస్వామ్యాలను అందించలేకపోయారని చెప్పాడు. శనివారం రాయ్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన టామ్ లాథమ్.. భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. సరైన ప్రదేశాల్లో బంతిని వేసి తమ పతానాన్ని శాసించారని తెలిపాడు.
'టాపార్డర్ బ్యాటర్లు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు వేసి మా పతనాన్ని శాసించింది. మేం కూడా అలానే ప్రయత్నించినప్పటికీ కలిసి రాలేదు. మాకు ఏమాత్రం కలిసాని రోజుల్లో ఇదొకటి. ఈ మ్యాచ్‌లో ప్రతీది భారత్‌కు వర్కౌటైంది. ఈ పిచ్‌పై టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది. కొన్ని బంతులు అనూహ్యంగా దూసుకొచ్చాయి. కొన్ని చాలా లోగా వచ్చాయి. బంతి మూవ్‌మెంట్ కూడా ఉంది. టాపార్డర్ బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయారు. లోయరార్డర్ అద్భుతంగా పోరాడినప్పటికీ మంచి లక్ష్యం సాధ్యమవ్వలేదు. మేం పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/18) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్‌వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51), శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, సాంట్నర్ తలో వికెట్ తీసారు.