ఐపీఎల్ మాజీ క్రికెటర్, ఉత్తరాఖండ్ ప్లేయర్ రాబిన్ బిస్ట్‌పై పోలీస్ కేసు నమోదైంది. రాబిన్ బిస్ట్‌తో పాటు మరో ముగ్గురు తనను మోసం చేశారని, మాయ మాటలతో రూ. 6.10 కోట్లు కాజేశారని తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లోని సేలెమ్ స్పార్టాన్స్ జట్టు ఓనర్ ఎమ్ సెల్వకుమార్ పోలీసులను ఆశ్రయించాడు.
సేలెమ్ టీమ్ ఓనర్ ఫిర్యాదుతో చెన్నైలోని సీసీబీ-1 పోలీసులు మాజీ క్రికెటర్ రాబిన్ బిస్ట్‌తో పాటు అతని స్నేహితులు ఆకాశ్ సుమ్రా(మరో క్రికెటర్), సతీష్ కుమార్, నితిన్ ఖోఖర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్‌ఐర్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాబిన్ బిస్ట్, ఆకాశ్ సుమ్రాలు సెల్వకుమార్‌కు సతీష్ కుమార్, నితిన్ ఖోఖర్ అనే ఇద్దరి వ్యక్తులను పరిచయం చేశాడు. ఈ ఇద్దరికి వెస్టిండీస్ వేదికగా జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్)ని ఓ జట్టులో భాగస్వామ్యం ఉందని నమ్మించారు. ఆ జట్టులోని 25 శాతం వాటాను అమ్మాలనుకుంటున్నామని, రూ. 22 కోట్లు ఇస్తే ఆ వాటాను ఇచ్చేస్తామని సెల్వకుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అందుకు తగ్గట్లుగానే నకిలీ పేపర్లను సృష్టించారు. ఇది నిజమేనని నమ్మిన సెల్వకుమార్ వారికి పలు దఫాల్లో రూ. 6 కోట్ల 10 లక్షల వరకు చెల్లించాడు. ఈ డీల్‌లో దుబాయ్‌కి చెందిన ఓ క్రికెట్ ఏజెంట్ మధ్యవర్తిగా కూడా వ్యవహరించాడని సెల్వకుమార్ ఆరోపించాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి డబ్బులు తిరిగి చెల్లించమంటే బెదిరింపులకు దిగుతున్నారని, గత్యంతరం లేకనే తాను పోలీసులను ఆశ్రయించానని సెల్వకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును చేర్చడంపై రాబిన్ బిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మోసానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, నిందితులను సెల్వకుమార్‌కు పరిచయం చేసిన మాట వాస్తవమని, కానీ ఈ డీల్ గురించి తనకు ఏం తెలియదన్నాడు. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకు చేరగా..పలువురు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం నేపథ్యంలో టీఎన్‌పీఎల్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడి ప్రమేయంపై అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఐపీఎల్‌లో రాబిన్ బిస్ట్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు.
దేశవాళీ క్రికెట్‌లో 100కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు భారత్-ఏ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. రాబిన్ బిస్ట్‌పై పోలీస్ కేసు పెట్టిన సెలం స్పార్టాన్స్ టీమ్ ఓనరే.. టీఎన్‌పీఎల్ 2024 వేలంలో అతన్ని తిరిగి కోనుగోలు చేయడం గమనార్హం.