చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) 2023 సీజన్‌లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్యాచ్ కోసం ప్రయత్నించిన ముగ్గురు ఫీల్డర్లు చివరకు బంతిని అందుకోకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో ఇలాంటి మిస్ ఫీల్డ్ ఘటనలను ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి ఘటనే టీఎన్‌పీఎల్‌లో చోటు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.
టీఎన్‌పీఎల్‌లో భాగంగా నెల్లాయ్ రాయల్ కింగ్స్ - దుండిగల్ డ్రాగన్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.దుండిగల్ బ్యాటింగ్ సందర్భంగా నెల్లాయ్ రాయల్ కింగ్స్ బౌలర్ వేసిన 19వ ఓవర్‌లో ఈ వింతయిన క్యాచ్ డ్రాప్ జరిగింది. ఈ ఓవర్ తొలి బంతిని పోయమోజి ఆఫ్ సైడ్ వేయగా.. బ్యాటర్ సుబోధ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

కానీ బ్యాడ్ ఎడ్జ్ తాకిన బంతి కీపర్ మీదుగా గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం కీపర్, ఫైన్‌లెగ్, షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్లు పరుగు తీశారు. తీరా, అక్కడికి వెళ్లాక ముగ్గురు వదిలేయడంతో బ్యాటర్ బచాయించాడు. ముగ్గురి మధ్య సమాచార లోపంతో సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. వికెట్ కీపర్ తీసుకుంటాడని షార్ట్ థర్డ్ మ్యాన్, ఫైన్ లెగ్ ఫీల్డర్లు చూస్తూ ఉండిపోయారు.
బంతి కీపర్ వెనుకాల పడుతుండటం.. ఫైన్ లెగ్ ఫీల్డర్ అక్కడికి సమీపించడంతో అతనూ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. చివరకు బంగారం లాంటి క్యాచ్ నేలపాలైంది. ఈ వీడియోను చూసిన అభిమానులు గతంలో ఇలానే పాకిస్థాన్ ఫీల్డర్లు వదిలేసిన క్యాచ్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.2008లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలాగే విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను వదిలేశారు. క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో కీపర్ ఉమర్ గుల్, షోయబ్ మాలిక్ వదిలేసారు.
టీఎన్‌పీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో నెల్లాయ్ రాయల్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దిండిగల్ 20 ఓవర్లలో డ్రాగన్స్ 5 వికెట్లకు 185 పరుగులు చేయగా.. నెల్లాయ్ రాయల్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులతో విజయాన్నందుకుంది.
ఆసక్తికర ఘటనలకు టీఎన్‌పీఎల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లు ఆడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేసి ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు.