ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ అవకాశాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది. మరోవైపు శ్రీలంక ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందుడుగు వేయలేదు. హుస్సేన్ తలత్(2/18, 32 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. కామిందు మెండిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ చరిత్ అసలంక(20)తో పాటు కుశాల్ మెండీస్(0), డసన్ షనక(0), పాతుమ్ నిస్సంక(8) తీవ్రంగా నిరాశపర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/28) మూడు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్(2/37), హుస్సేన్ తలత్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. అబ్రర్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి 12 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. హుస్సేన్ తలత్(30 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్), మహహ్మద్ నవాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ(2/24), వానిందు హసరంగా(2/27) రెండేసి వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా(1/31) ఒక వికెట్ పడగొట్టాడు.