సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డార్విన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ డేవిడ్(52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83) సంచలన ప్రదర్శనతో ఆసీస్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టీమ్ డేవిడ్(83)తో పాటు కామెరూన్ గ్రీన్(13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) మాత్రమే రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెన్ మఫకా(4/20) నాలుగు వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, జార్జ్ లిండే, సెనురన్ ముత్తుసామీ తలో వికెట్ తీసారు. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును టీమ్ డేవిడ్ ఆదుకున్నాడు. బెన్ ద్వార్షుయిస్(17)తో ఏడో వికెట్‌కు 59 పరుగులు జోడించిన టీమ్ డెవిడ్.. నాథన్ ఎల్లిస్‌తో కలిసి 8వ వికెట్‌కు 30 పరుగుల జోడించాడు.

అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులే చేసి ఓటమిపాలైంది. సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71), ట్రిస్టన్ స్టబ్స్(27 బంతుల్లో 5 ఫోర్లతో 37) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/27), బెన్ ద్వార్షుయిస్ మూడేసి వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆడమ్ జంపా(2/33) రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగనుంది.