రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'ఆడు మగాడ్రా బుజ్జి'అని కొనియాడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై.. స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేసింది. ఇందులో టీమ్ డేవిడ్ ఒక్కడే 50 పరుగులు చేయడం గమనార్హం. మిగతా బ్యాటర్లలో రజత్ పటీదార్(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లీ(1), ఫిల్ సాల్ట్(4), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(2), కృనాల్ పాండ్యా(1) తీవ్రంగా నిరాశపరిచారు.

ఇజ్జత్ కాపాడిన డేవిడ్..
టీమ్ డేవిడ్ రాణించకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల్లోపే ఆలౌటై మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేది. టీమ్ డేవిడ్ అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అతని అసాధారణ హాఫ్ సెంచరీ జట్టు ఇజ్జత్ కాపాడటంతో పాటు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఆఖరి మూడు బంతులను సిక్సర్లుగా తరలించిన టీమ్ డేవిడ్.. చివరి బంతి నోబాల్ కావడంతో క్విక్ డబుల్ తీసి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.
తొలి ఆటగాడిగా..
పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నెహాల్ వధేరా(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33 నాటౌట్) రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/14) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడినా.. టీమ్ డేవిడ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఓడిన జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ప్లేయర్‌గా టీమ్ డేవిడ్ చరిత్రకెక్కాడు. అతని పోరాటానికి దక్కిన విలువ ఇది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ సీజన్‌లో టీమ్ డేవిడ్ అదరగొడుతున్నాడు. ఆఖర్లో ఫినిషర్‌గా ఆర్‌సీబీకి విలువైన పరుగులు అందిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌లో ఆడిన టీమ్ డేవిడ్ వరుసగా 22*, 32, 1*, 37*, 50* పరుగులు చేశాడు. 194.52 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 142 పరుగులు చేశాడు.
కోహ్లీ రికార్డ్ బద్దలు..
ఐపీఎల్ చరిత్రలోనే 100 పరుగులు చేయని జట్టులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా టీమ్ డేవిడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ చేసిన జట్టులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డ్‌ను టీమ్ డేవిడ్ అధిగమించాడు. 2013లో సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 106/2 పరుగులే చేయగా.. కోహ్లీ(29 బంతుల్లో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు.