ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు.
ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్‌తో విజయ తిలకం దిద్దాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. పాకిస్థాన్‌కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లకు మూడు ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్‌జాద్ ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో టోర్నీ ఆసాంతం చెలరేగిన అభిషేక్ శర్మ కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్‌లో సల్మాన్ అలీ అఘా స్టన్నింగ్ క్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్(1) పెవిలియన్ చేరాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన మరుసటి ఓవర్‌లో స్టెప్ ఔటై బౌండరీ బాదిన శుభ్‌మన్ గిల్.. అదే తరహా షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. సంజూ ఓ ఫోర్ బాదగా.. తిలక్ వర్మ సిక్స్, బౌండరీ కొట్టడంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 36 పరుగులు చేసింది.
అనంతరం పాకిస్థాన్ స్పిన్నర్లను తిలక్-సంజూ ఆచితూచి ఆడారు. అయితే 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హుస్సేన్ తలత్ నేలపాలు చేశాడు. దాంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ పూర్తిగా క్విక్ సింగిల్స్‌పై ఫోకస్ పెట్టింది. వీలు చిక్కిన బంతిని తిలక్, సంజూ సిక్సర్ తరలించి ఒత్తిడి తగ్గించారు. దూకుడుగా ఆడే క్రమంలో సంజూ శాంసన్(24) అబ్రర్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 57 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. తిలక్ వర్మకు అండగా నిలిచాడు. హరీస్ రౌఫ్ వేసిన 15వ ఓవర్‌లో శివమ్ దూబే బౌండరీ బాదగా.. తిలక్ వర్మ ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. దాంతో 17 పరుగులు వచ్చాయి. అబ్రర్ అహ్మద్ మరుసటి ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో తిలక్ వర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్‌ను షాహిన్ షా అఫ్రిది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. హరీస్ రౌఫ్ వేసిన 18వ ఓవర్‌లో శివమ్ దూబే సిక్స్ బాది 13 పరుగులు పిండుకున్నాడు. దాంతో టీమిండియా విజయానికి చివరి 2 ఓవర్లలో 17 పరుగులు అవసరమయ్యాయి.
ఫహీమ్ బౌలింగ్‌లో శివమ్ దూబే బౌండరీ బాది మరుసటి బంతికి బౌండరీ లైన్‌పై క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్‌లో తిలక్ వర్మ సిక్స్ బాదగా.. రింకూ సింగ్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.