ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయాన్నందుకుంది. గ్రూప్-సీలో భాగంగా కర్ణాటకతో అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ తిలక్ వర్మ(106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 99), వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) అసాధారణ బ్యాటింగ్‌తో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 320 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 124) సెంచరీ సాధించగా... ఆర్ సమరణ్(75 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83) హాఫ్ సెంచరీతో రాణించాడు.

హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్, రోహిత్ రాయుడు తలో వికెట్ తీసారు. అనికేత్ రెడ్డి(2/40) రెండు వికెట్లు తీసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. చివర్లో తనయ్ త్యాగరాజన్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25)కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దుబే(2/49), నికిన్ జోస్(2/45) రెండేసి వికెట్లు తీయగా.. అభిలాష్ శెట్టి, విద్యాదర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. భారీ లక్ష్యచేధనలో ఓపెనర్లు రోహిత్ రాయుడు(0), తన్మయ్ అగర్వాల్(35) విఫలమైనా.. తిలక్ వర్మ, వరుణ్ గౌడ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. ఈ కీలక భాగస్వామ్యం హైదరాబాద్‌కు విజయాన్నందించింది.