ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపులకు పాల్పడ్డారని, సూటి పోటీ మాటలతో రెచ్చగొట్టారని టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అన్నాడు. ఆ మాటలకు సహనం కోల్పోకుండా బ్యాట్‌తో సమాధానం ఇవ్వాలనుకున్నానని, అలానే చేశానని తెలిపాడు. విజయం తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు ముఖం చాటేసారని, తనకు ఎదురపడలేదని పేర్కొన్నాడు. గత ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సోమవారం స్వదేశం చేరుకున్న తిలక్ వర్మకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్ర సేనారెడ్డి, ఎండీ సోనీ బాలా దేవి తిలక్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన తిలక్.. మంగళవారం తన క్రికెట్ అకాడమీ(లీగాలా క్రికెట్ అకాడమీ)ని సందర్శించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ ఫైనల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'ఫైనల్లో నేను క్రీజులోకి వచ్చే సమయానికి మూడు వికెట్లు పడ్డాయి. తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు సూటి పోటీ మాటలతో కవ్వింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా పాకిస్థాన్ వికెట్ కీపర మహమ్మద్ హరిస్ వెనుకాల నుంచి స్లెడ్జింగ్‌కు దిగాడు. ఇది ఐపీఎల్ కాదని, ముంబై కాదని ఎద్దేవా చేశాడు.
ఆ మాటలకు కోపం వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు దేశమే గుర్తొచ్చింది. ఓడితే దేశం తక్కువ అవుతుందని నన్ను నేను బ్యాక్ చేసుకున్నాను. వారి మాటలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఎవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమైన ఇన్నింగ్స్.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకస్థాన్ ఆటగాళ్లు కొంత దూకుడుగా వచ్చారు. క్రీడలను ఎమోషన్స్‌తో ఆడితే కష్టం. ఆటను ఆటలా ఆడి వారికి మంచి రిప్లె ఇచ్చాం. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటను చూస్తూ పెరిగాను. అతనితో నన్ను పోల్చడం గర్వంగా ఉంది. వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించడమే నా లక్ష్యం.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.