సౌతాఫ్రికా-ఏతో అనధికార మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఏకు ఘోర పరాజయం ఎదురైంది. రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 72 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ సిరీస్‌ను భారత్-ఏ జట్టు 2-1తో కైవసం చేసుకుంది.
ఆఖరి అనధికార వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. లుహన్ డ్రీ ప్రిటోరియస్(98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 123), రివల్డో మూన్‌సమీ(130 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107) సెంచరీలతో రాణించారు. భారత్-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం భారత్ 49.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఆయుష్ బదోని(66 బంతుల్లో 8 ఫోర్లతో 66), ఇషాన్ కిషన్(67 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ తిలక్ వర్మ(11), అభిషేక్ శర్మ(11), రుతురాజ్ గైక్వాడ్(25) దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో పీటర్(4/48) నాలుగు వికెట్లు తీయగా.. మోరెకి(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సన్నాహకంగా ఈ మూడు అనధికార వన్డేలను నిర్వహించారు. ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్లకు భారత వన్డే జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ 117, 68 పరుగులతో రాణించాడు. అతనికి సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో అవకాశం దక్కవచ్చు. ఈ మూడు వన్డేల్లో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు.
నవంబర్ 30 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది.