ఈ ఒక్కసారే కాదు.. టీమిండియాను మూడుసార్లు ముంచిన రనౌట్!

న్యూఢిల్లీ: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియాను దురదృష్టం వెంటాడుతోంది. పురుషులు, మహిళల క్రికెట్ అనే తేడా లేకుండా కీలక మ్యాచ్‌ల్లో అదృష్టం కలిసిరాక టీమిండియా ఓటమిపాలవుతోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుకు కాలం కలిసి రాలేదు. విజయం దిశగా సాగిన జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అనూహ్య రనౌట్‌తో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ప్రపంచకప్ గెలవాలనే భారత అమ్మాయిల ఆశలు అడియాశలయ్యాయి.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. జెమీమాతో కలిసి ఆదుకుంది. నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత జెమీమా ఔటైనా... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును విజయం వైపు నడిపించింది.

2019 వన్డే ప్రపంచకప్‌లోనూ..
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఓవైపు టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనా.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతున్నా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సాధ్యమైనంత వరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని ధోనీ భావించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. మార్టిన్ గప్టిల్ పవర్‌ఫుల్ త్రోకు మిల్లిమీటర్ దూరంలో ధోనీ రనౌటయ్యాడు. ఆ సమయంలో ధోనీతో పాటు లెగ్ అంపైర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

2003 వన్డే ప్రపంచకప్‌లోనూ..
ఈ రెండు ఘటనలే కాకుండా 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియాను ఈ తరహా దురదృష్టమే వెంటాడింది. ఆసీస్ విధించిన 360 పరుగుల భారీ లక్ష్యచేధనలో టీమిండియా.. 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 81 బంతుల్లో 82 పరుగులు చేసి.. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. దాంతో టీమిండియా పటిష్టంగా కనిపించింది. కానీ డారెన్ లెహ్మాన్ విసిరిన సూపర్ త్రోకు సెహ్వాగ్ రనౌటయ్యాడు. ఈ వికెట్ అనంతరం భారత్ 234 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

గుర్తు చేసుకున్న సెహ్వాగ్..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓటమి అనంతరం సెహ్వాగ్ ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నాడు. కీలక మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నర్ రనౌటవ్వడమేని గతంలోనూ జరిగిందని పేర్కొన్నాడు. 'సెమీఫైనల్లో క్రీజులో ఉన్న మ్యాచ్ విన్నర్ రనౌటవ్వడం గతంలోనూ జరిగింది. మెగా టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించడం నిరాశకు గురి చేసింది. గెలిచే మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా మరోసారి తమను ఓడించడం అంత సులువు కాదని నిరూపించింది. ఓడినా మనమ్మాయిలు అద్భుతంగా పోరాడారు'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications