టీ20 క్రికెట్‌లో 24 గంటల వ్యవధిలోనే మూడు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ముందుగా శుక్రవారం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్‌ఎల్)2024 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్, వెస్టిండీస్ క్రికెటర్ అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్ నమోదు చేయగా.. అదే రోజు వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ హ్యాట్రిక్ సాధించింది.
తుషారా హ్యాట్రిక్..
ఇక శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ నువాన్ తుషారా హ్యాట్రిక్‌తో చెలరేగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో తుషారా ఈ ఘనతను సాధించాడు. ఈ ఓవర్ రెండో బంతికి బంగ్లా బ్యాటర్ నజ్ముల్ హుస్సెన్ షాంటోను క్లీన్ బౌల్డ్ చేసిన తుషారా.. తర్వాతి రెండు బంతుల్లో హృదయ్, మహ్మదుల్లాలను క్యాచ్ ఔట్లుగా పెవిలియన్ చేర్చాడు.

దాంతో టీ20ల్లో శ్రీలంక తరఫున హ్యాట్రిక్ సాధించిన ఐదో బౌలర్‌గా అతను చరిత్రకెక్కాడు. నువాన్ తుషారా ధాటికి శ్రీలంక 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
దీప్తి శర్మ హ్యాట్రిక్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీప్తి శర్మ హ్యాట్రిక్ సాధించింది. కెప్టెన్ మెగ్‌లానింగ్(46 బంతుల్లో 12 ఫోర్లతో 60)ను 14వ ఓవర్ చివరి బంతికి ఔట్ చేసిన దీప్తి.. 19వ ఓవర్లలో తొలి రెండు బంతులకు అనాబెల్(6), అరుంధతి(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌తో సంచలన విజయాన్నందించింది.
హుస్సేన్ హ్యాట్రిక్
పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్ తీసాడు. అతను వేసిన 16వ ఓవర్‌లో రెండు, మూడు, నాలుగు బంతులకు అమెర్ జమాల్, మెహ్రాముంతాజ్, లుక్ వుడ్ వెనుదిరిగారు. అయినా ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఓటమి తప్పలేదు.