ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఈ ఒక్క మ్యాచ్‌తోనే ఆగిపోదని, భవిష్యత్తులో కూడా భారత్‌తో జరిగే మ్యాచ్‌లను పాకిస్థాన్ బహిష్కరిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఆదివారం తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన రషీద్ లతీఫ్.. ఐసీసీ ఎన్ని ఆంక్షలు విధించినా పీసీబీ భయపడబోదని స్పష్టం చేశాడు. 'భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల నుంచి ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో ఉమ్మడి వేదికగా మ్యాచ్‌లు ఆడేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దాంతో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ భారత్ రావడానికి నిరాకరించినప్పుడు ఐసీసీ తేలికగా తీసుకుంది. కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణం మారిపోయింది. గతంలోలా కాకుండా బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా భారత్‌తో మ్యాచ్‌లను పాకిస్థాన్ బహిష్కరించనుంది. ఐసీసీ ఆంక్షలు, మ్యాచ్ ఓటమి గురించి పీసీబీ ఆందోళన చెందడం లేదు. సాధారణంగా పీసీబీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు.
చాలా ఆలోచించిన తర్వాతే ఈ అడుగు వేశారు. ఫిబ్రవరి 15 జరిగే మ్యాచ్‌తోనే ఇది ఆగిపోదు. మహిళల వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2028లో కూడా భారత్‌తో మ్యాచ్‌లను పాక్ ఇలానే బహిష్కరించనుంది. అయితే వ్యాపారవేత్తలు ప్రభుత్వాలను శాసిస్తారు. బ్రాడ్‌కాస్టర్లు ఊరుకోరు కాబట్టి ఏదో ఒక పరిష్కారం వెతుకుతారు. దౌత్యపరంగా ఏదో పరిష్కారం చూపించే ప్రయత్నం జరగవచ్చు.'అని ఆయన రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు.