టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ప్రపంచంలోనే ఫిట్‌నెస్ ఫ్రీక్ ఎవరంటే.. అందరూ మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు కోహ్లీ. అంతలా ఫిట్‌నెస్ విషయంలో ఈ స్టార్ బ్యాటర్ ప్రభావితం చేశాడు.యువ ఆటగాళ్లతో పాటు యావత్ దేశానికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. అలాంటి కోహ్లీ అనూహ్యంగా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేను కోహ్లీ ఆడటం లేదు.
గత రాత్రే కోహ్లీకి మోకాలి నొప్పి వచ్చిందని, ముందస్తు చర్యల్లో భాగంగా అతనికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చామని టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ప్రకటన కోట్లాది కోహ్లీ అభిమానులకు నిరాశను మిగిల్చింది. తమ అభిమాన ఆటగాడి ఆటను చూసేందుకు కోహ్లీ ఫ్యాన్స్ గత నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ చెలరేగుతాడని అంతా భావించారు. తన బ్యాటింగ్ స్టైల్‌కు అనుకూలంగా ఉండే వన్డే ఫార్మాట్‌తో మళ్లీ ఫామ్‌లో వస్తాడని కలలు కన్నారు.

కానీ కోహ్లీ అనూహ్యంగా గాయంతో తప్పుకున్నాడు. అయితే కోహ్లీ 17 ఏళ్ల వన్డే కెరీర్‌లో గాయంతో ఓ మ్యాచ్‌కు దూరంగా ఉండటం ఇది రెండోసారి మాత్రమే. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కే కోహ్లీ గజ్జలో గాయంతో దూరమయ్యాడు. అయితే కోహ్లీకి గాయమైందనే విషయం నమ్మశక్యంగా లేదని, జట్టులో నుంచి తప్పించేందుకు సాకుగా గాయమైనట్లు చెబుతున్నారని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. రంజీ ట్రోఫీలోనూ 6 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకు కోహ్లీ తడబడుతున్నాడు. నాలుగు, ఐదో స్టంప్ డెలివరీలను వెంటాడి మరీ క్యాచ్‌లు సమర్పించుకుంటున్నాడు.