
సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని ఫిలిప్పిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక నిరూపించింది. కనీస సౌకర్యాలు లేకున్నా.. అందుబాటులో ఉన్న వాటితోనే సర్దిపుచ్చుకొని తనకు నచ్చిన ఆటలో సత్తా చాటి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆ చిన్నారి సంకల్పం ముందు పేదరికం ఓడిపోయింది. ఆమె వినూత్న ఆలోచనకు యావత్ ప్రపంచం ఔరా అంటుంది. భళా బాలిక! అని సలామ్ చేస్తోంది. రియా బుల్లోస్ ఫిలిప్పిన్స్‌కు చెందిన 11 ఏళ్ల చిన్నారి. డిసెంబర్ 9న జరిగిన స్థానిక ఇంటర్ స్కూల్ రన్నింగ్ కాంపిటేషన్‌లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుంది.
400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగుపందేల్లో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచింది. ఈ మూడు విభాగాల్లో ఆమె కనీసం బూట్లు కూడా లేకుండానే పరుగెత్తింది. అలా అని ఉత్తి కాళ్లతో కూడా ఆమె రేసులో పాల్గొనలేదు. స్మార్ట్‌గా ఆలోచించి తన ఆటకు పేదరికం అడ్డురాకుండా చూసుకుంది. బ్యాండెజ్‌లతో బూట్లూ తయారు చేసుకుంది. పాదం, కాలి వేళ్లకు చూట్టూ బ్యాండేజ్‌లు చుట్టుకుంది. అంతేకాకాండా షూస్ మాదిరి వాటిపై ప్రముఖ కంపెనీ నైక్ బ్రాండ్ లోగోను కూడా మార్కర్‌తో గీసుకుంది. ఆ చిన్నారి సాధించిన విజయాల కన్నా.. ఆమె హోమ్ మేడ్ షూసే చర్చనీయాంశమైంది. రియా బుల్లోస్ హోమ్ మేడ్ షూస్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆ చిన్నారి ఆలోచనను ప్రశంసిస్తున్నారు.
కావాల్సిన వస్తువులు లేవని తల్లిదండ్రుల వద్ద మారం చేసే చిన్నారులు ఉన్న ఈ రోజుల్లో రియా ఇలా తనకు అందుబాటులో ఉన్న వాటితోనే సరిదిద్దుకోవడం, ఆమె ఉన్నత ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శభాష్ రియా.. అంటూ కొనియాడుతున్నారు. ఇక కొందరైతే తాను గీసుకున్న కంపెనీ నైక్‌ను ఆ చిన్నారికి షూస్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. రియా సోషల్ మీడియాలో సెన్సేషన్ కావడంతో.. సీఎన్‌ఎన్ ఫిలిప్పిన్స్ ఆమెకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. రియా కోచ్‌తోనూ ప్రత్యేకండా మాట్లాడింది. రియా లాంటి శిష్యురాలు తనకు దొరకడం అదృష్టమని ఆమె కోచ్ పేర్కొంది. ఆమె కథనం చూసి చలించిపోయిన కొందరు క్రీడాకారులు ఆమెకు షూస్‌తో పాటు కనీస సౌకర్యాలు కల్పించారు.