ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అని, కానీ వారి చర్యలే చిల్లరగా ఉన్నాయని విమర్శించాడు. ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించడాన్ని బసిత్ అలీ తప్పుబట్టాడు. ఈ పనులతో ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ట్రోఫీ లేకుండానే విజయ సంబరాలు చేసుకుంది. స్వదేశానికి తిరిగొచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ.. పాకిస్థాన్ మంత్రిగా కూడా కొనసాగుతున్నాడని, ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని టీమిండియా స్పష్టం చేసింది. మరోవైపు తన చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాలని, ఏసీసీ ప్రెసిడెంట్‌గా ట్రోఫీ ప్రదానం చేయడం తన హక్కు అని నఖ్వీ పట్టుబట్టాడు. చివరకు ట్రోఫీ అందుకోవడానికి భారత్ ముందుకు రాకపోవడంతో నఖ్వీ దాన్ని తీసుకోని వెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ఊహాజనిత ట్రోఫీతో సంబరాలు చేసుకున్నారు.

ట్రోఫీ పట్టుకెళ్లిన నఖ్వీ తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రోఫీ అతని సొత్తు కాదని మండిపడింది. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన బసిత్ అలీ.. మోహ్‌సిన్ నఖ్వీకి అండగా నిలిచాడు. 'టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ టీమ్. కానీ వారి చర్యలు మాత్రం థర్డ్ క్లాస్‌గా ఉన్నాయి. మోహ్‌సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేస్తారు. టీమిండియా దాన్ని స్వీకరించకపోతే వారే ప్రపంచం దృష్టిలో అపఖ్యాతి పాలవుతారు. ట్రోఫీని మాత్రం వారికి అప్పగించకూడదు.
ఈ చర్యలతో టీమిండియా ఓ చెడు సంప్రదాయానికి తెరలేపింది. వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది. కానీ ఈ మొండితనం ఏంటి? మోహ్‌సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఇది ఐసీసీ టోర్నీ అయి ఉంది.. జై షా నుంచి ట్రోఫీని పాకిస్థాన్ తీసుకోకపోతే..వారిదే తప్పై ఉండేది.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు. మరోవైపు ట్రోఫీ ప్రదానంపై అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. బీసీసీఐకి బెదిరి యూఏఈ క్రికెట్ బోర్డుకు ట్రోఫీని మోహ్‌సిన్ నఖ్వీ ఇచ్చేసాడని, సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీసీ ఆఫీస్‌కు వచ్చి ట్రోఫీ తీసుకోవాలని కండిషన్ పెట్టాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ట్రోఫీ ప్రదానం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.