డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడం తమ పతనాన్ని శాసించిందని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. 15 ఓవర్ల వరకు అద్భుతంగా బౌలింగ్ చేశామని చెప్పిన ఎడ్వర్డ్స్.. చివరి 5 ఓవర్లను కూడా కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎడ్వర్డ్స్.. వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. భారత్‌లో మైదానాలు చిన్నగా ఉంటాయని, బ్యాటింగ్ అనుకూలంగా ఫ్లాట్ వికెట్స్ ఉంటాయని తెలిపాడు. 'ఈ మ్యాచ్‌ను మేం అద్భుతంగా ప్రారంభించాం. ఈ క్రెడిట్ అంతా ఆర్యన్ దత్‌కే దక్కుతుంది. అతను గత కొన్నేళ్లుగా మాకు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. మ్యాచ్‌లో కొంతసేపు మేం మంచి పట్టు మీద ఉన్నామని అనిపించింది. భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో చివరి వరకు పవర్ హిట్టర్లు ఉన్నారని తెలుసు. 14-15 ఓవర్ల వరకు వారిని నియంత్రణలో ఉంచడం విశేషం.

అయితే కొన్ని అవకాశాలను వదులుకోవడంతో పాటు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. భారత్ చేతిలో వికెట్లు ఉండటంతో ఆఖరి ఓవర్లలో వారు రెచ్చిపోయి ఆడారు. ఈ మ్యాచ్‌లో ఓడినా చాలా విషయాలు నేర్చుకున్నాం. భారత్ పర్యటనకు వచ్చిన ప్రతీసారి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడి మైదానాలు చాలా చిన్నవి. పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటాయి. ప్రేక్షకులు భారీగా వస్తారు. ఈ టోర్నీ చుట్టూ చాలా సందడి ఉంటుంది. ఒక జట్టుగా పెద్ద మ్యాచ్‌ల్లో రాణించడం మాకు గర్వకారణం. మేం బాగానే ఆడాం. కానీ కీలకమైన క్షణాల్లో వచ్చిన అవకాశాలను మాకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది.'అని ఎడ్వర్డ్స్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా..తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) దూకుడుగా ఆడలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్(3/56) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లేన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమిపాలైంది. బాస్ డీ లీడే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), జాచ్ లయన్(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26), నోహ్ క్రోస్(12 బంతుల్లో 5 ఫోర్లతో 25 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/14) మూడు వికెట్లు తీయగా.. శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. సూపర్-8 దశలో టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.