Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను పిచ్చోడు అన్నారు.. ముకుల్ చౌదరి తండ్రి కన్నీటి పర్యంతం!

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన లక్నో సూపర్ జెయింట్స్ నయా ఫినిషర్ ముకుల్ చౌదరి టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. అసాధారణ బ్యాటింగ్‌తో లక్నోకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ముకుల్ చౌదరి.. రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు.

తన మూడో ఐపీఎల్ మ్యాచ్‌లోనే యావత్ దేశం గుర్తించే ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2026 వేలంలో ముకుల్ చౌదరిని లక్నో రూ.2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ తన తొలి రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముకుల్ 14, 2 నాటౌట్‌ పరుగులే చేశాడు. కేకేఆర్‌తో మూడో మ్యాచ్‌లో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన లక్నో జట్టును ముకుల్ చౌదరి(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గెలిపించాడు.

నాన్నకు ప్రేమతో..

ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను ముకుల్ చౌదరి తన తండ్రికి అంకితం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తనను క్రికెటర్‌గా చూడాలనేది తన తండ్రి కల అని, తన కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని భావోద్వేగానికి గురయ్యాడు. ముకుల్ చౌదరి ప్రదర్శన పట్ల అతని తండ్రి దలిప్ కుమార్ చౌదరి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన కష్టాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

They Called Me Mad Mukul Choudhary Father Recalls Heartbreaking Sacrifices After Son s IPL Glory
Photo Credit: twitter (X)

బేటా ఏడ్చావా..?

'కేకేఆర్‌తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన అనంతరం నా కొడుకును ఒక్కటే అడిగా.. బేటా.. ఏడ్చావా? అని. వాడు నవ్వుతూ అవునన్నట్లు తల ఊపాడు. ఢిల్లీతో మ్యాచ్ గెలపించలేకపోయానని వాడు చాలా నిరాశ చెందాడు. 'మేనేజ్‌మెంట్ నాపై చాలా డబ్బు ఖర్చు చేసింది. కానీ నేను మ్యాచ్‌లు గెలపించలేకపోతే ఏం లాభం?' అని పదే పదే నాతో అనేవాడు. చాలా బాధపడ్డాడు కూడా. కానీ వచ్చే మ్యాచ్‌లో అందరూ గర్వపడేలా చేస్తానని నాకు మాట ఇచ్చాడు. చివరకు వాడు అన్నంత పనీ చేశాడు.

నేను 2003లో డిగ్రీ పూర్తి చేశాను. అదే ఏడాది నాకు పెళ్లయింది. ఒకవేళ నాకు కొడుకు పుడితే అతన్ని కచ్చితంగా క్రికెటర్‌ను చేయాలని అప్పుడే కల కన్నాను. మరుసటి ఏడాది నాకు కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుంచే వాడిని క్రికెటర్‌గా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను. లోకంలో ఇంతమంది క్రికెటర్లు అవుతున్నప్పుడు.. నా కొడుకు ఎందుకు కాలేడు? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

అప్పులతో జైలుకు వెళ్లాను..

అయితే ఈ ప్రయాణం సాఫీగా సాగలేదు. వాడిని క్రికెట్ అకాడమీలో చేర్చాక.. నా దగ్గర తగినంత డబ్బు లేదని అర్థమైంది. నాకు స్థిరమైన ఆదాయం లేదు, అందుకే సొంత ఇంటిని అమ్మేశాను. ఆ ఇంటి ద్వారా వచ్చిన రూ. 21 లక్షలను రికార్డులో ఉండాలని నేరుగా నా బ్యాంకు ఖాతాకే బదిలీ చేయించుకున్నాను.

ఆ తర్వాత హోటల్ బిజినెస్ మొదలుపెట్టి లోన్ తీసుకున్నాను. కానీ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోయాను. ఆ అప్పుల వల్ల నేను జైలుకు కూడా వెళ్లాను. కానీ నేను ఎప్పుడూ ఎవర్నీ మోసం చేయలేదు.

నన్ను పిచ్చోడు అన్నారు..

నా బంధువులందరూ నన్ను వదిలేశారు. నన్ను పిచ్చోడు అన్నారు. 'నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావు, కనీసం నీ కొడుకునైనా వదిలేయ్'అని మొహం మీదే చెప్పేవారు. కానీ ఆ మాటలే మా కుటుంబాన్ని మరింత ధృడంగా మార్చాయి. ఆ కఠినమైన మాటలే నేను చేసేది సరైనదేనని నిరూపించుకోవాలనే పట్టుదలనిచ్చాయి.

చిన్నప్పుడు నేను కూడా లోకల్ క్రికెట్ టోర్నీలు ఆడేవాడిని. నాకు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. నా కొడుకుతో కలిసి సచిన్ వీడియోలు చూసేవాడిని. కానీ 2011 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ విన్నింగ్ సిక్సర్ చూశాక.. నా కొడుకు ధోనీకి వీరాభిమాని అయిపోయాడు. వెంటనే నాకు ఒక జత వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ కావాలని అడిగాడు.'అని దలిప్ కుమార్ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, April 10, 2026, 17:50 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+