ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం ఉదయం పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. క్రికెట్ ప్రపంచంలోనే భారత్, పాకిస్థాన్ పోరు తర్వాత ఆ స్థాయిలో హోరాహోరీగా జరిగే సిరీస్ యాషెస్ మాత్రమే.
ఈ సారి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నాహాలను పూర్తి చేసుకోనున్నాయి. ఈ సారి కూడా సిరీస్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆతిథ్య ఆస్ట్రేలియా బరిలోకి దిగుతుండగా.. ఈ సారైనా యాషెస్ గెలవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది.

తొలి టెస్ట్‌లో బరిలోకి దిగే తుది జట్టును ఇంగ్లండ్ రెండు రోజుల ముందే ప్రకటించింది. తద్వారా తమ బజ్‌బాల్ గేమ్‌లో తగ్గేదే లేదని విషయాన్ని స్పష్టం చేసింది. బుధవారం 12 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన ఈ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, మార్క్ వుడ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు పిచ్ కండిషన్స్‌ను బట్టి జట్టుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మాములుగా టాస్ పడే వరకు తుది జట్ల వివరాలను ప్రకటించరు. కానీ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందే తుది జట్టును ప్రకటిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. ప్రత్యర్థి, కండిషన్స్‌తో సంబంధం లేకుండా తుది జట్లను ప్రకటిస్తూ సవాల్ విసురుతోంది. రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించడంపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'ఏం గుండెరా అది.. రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించారు'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంగ్లండ్ సరికొత్త ఆటతీరును ప్రదరిస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో దూకుడుగా ఆడుతోంది. బజ్‌బాల్ గేమ్ అంటూ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఘోర పరాజయాలు ఎదురైనా.. తమ అప్రోచ్‌ను మార్చుకోవడం లేదు. యాషెస్ సిరీస్ అయినా అంతే తీవ్రతతో బరిలోకి దిగుతోంది.