MS Dhoni:క్రికెట్‌లో మంచు ప్రభావంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంత తోపు జట్టు అయినా మంచు ప్రభావంతో ఓటమిపాలవుతుందని తెలిపాడు. కెప్టెన్‌గా తనను భయపెట్టిన ఏకైక అంశం కూడా ఇదేనని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలోనూ మంచు కీలక పాత్ర పోషిస్తుందని, టాస్ గెలవడం ఎంతో కీలకమని చెప్పాడు.
అరంగేట్ర ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007ను ధోనీ సారథ్యంలోనే భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా భారత్‌కు మరో టీ20 ప్రపంచకప్ రాలేదు. 2024లో రోహిత్ సారథ్యంలో రెండో టైటిల్ అందుకుంది. ముచ్చటగా మూడో టైటిల్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో సూర్యసేన బరిలోకి దిగుతోంది. అయితే పొట్టి ఫార్మాట్‌లో టైటిల్ గెలవడం అంత ఈజీ కాదని ధోనీ అభిప్రాయపడ్డాడు.

తాజాగా మాహి అన్‌ప్లగ్డ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. మంచు ప్రభావాన్ని తెలియజేస్తూ టీమిండియాను హెచ్చరించాడు. 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియా ఒకటి. వారు ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ ప్రారంభించారు. అసలు ఒక మంచి జట్టుకు కావాల్సిన అన్నీ అంశాలు టీమిండియాలో ఉన్నాయి. మంచు ప్రభావంలో ఆడిన అనుభవం కూడా ఉంది. వారు తీవ్ర ఒత్తిడిలో కూడా ఆడగలరు. జట్టులో ఎవరైతే ఏ పాత్రలు పోషిస్తున్నారో, వారు ఆ పరిస్థితుల్లో చాలా కాలం నుంచి రాణిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర జట్టు కూడా మంచు ప్రభావంతో ఓడిపోవచ్చు.
కెప్టెన్‌గా నన్ను ఏదైనా ఆందోళనకు గురి చేసి విషయం ఉందా? అంటే అది మంచే. మంచు అంటే నాకు అసహ్యం. ఇది చాలా విషయాలను మార్చేస్తుంది. ఒక్కోసారి మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. నేను ఆడుతున్న సమయంలో కూడా నన్ను భయపెట్టిన అంశం ఇదే. మంచు ప్రభావం వల్ల టాస్ గెలవడం చాలా కీలకంగా మారుతుంది. ఒకవేళ పరిస్థితులు ఇరు జట్లకు సమానంగా ఉంటే, భారత్ అత్యుత్తమ జట్లతో 10 మ్యాచ్‌లు ఆడినా, ఎక్కువ సార్లు విజేతలుగా నిలుస్తుంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ఆదివారం(ఫిబ్రవరి) తెరలేవనుంది. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుండగా.. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో టోర్నీ మొదలవ్వకుండానే భారత్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరినట్లు అయ్యింది. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.