తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో పవన్ కళ్యాణ్ టీమ్ హంగ్రీ చీతాస్ శుభారంభం చేసింది. ఎన్టీఆర్ అభిమానులకు చెందిన టైగర్స్ ఎలెవన్ జట్టుపై 83 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సోమవారం ఈ మ్యాచ్‌తోనే ఈ టోర్నీ ప్రారంభమవ్వగా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ అసాధారణ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ హంగ్రీ చీతాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీమ్ 17.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ టీమ్ బౌలర్ యాష్(5/19) ఐదు వికెట్లతో టైగర్స్ ఎలెవన్ పతనాన్ని శాసించాడు. హంగ్రీ చీతాస్ విజయంలో కీలక పాత్ర పోషించిన యాష్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
తెలుగు హీరోల అభిమానులంతా 12 జట్లుగా విడిపోయి టీఎఫ్‌ఐ ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఆడుతున్నారు. 12 జట్లను మొత్తం నాలుగు గ్రూప్‌లుగా విభిజించారు. నేడే(జనవరి 29) ప్రారంభమైన ఈ టోర్నీ ఫిబ్రవరి 2 (ఆదివారం)న ముగియనుంది. గ్రూప్-ఏలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టీమ్స్ ఉండగా.. గ్రూప్ బీలో చిరంజీవి రవి తేజ, గ్రూప్ సీలో నాగర్జున, మహేశ్ బాబు, ప్రభాస్, గ్రూప్-డీలో వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల టీమ్స్ ఉన్నాయి.
ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష క్యాష్ రివార్డుగా లభించనుంది. హైదరబాద్‌లోని ఆజిజ్ నగర్‌లోని ఏఎమ్ క్రికెట్ గ్రౌండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రచారం చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. పైగా తమ అభిమాన హీరోల పేర్ల మీద టీమ్స్ ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఈ టోర్నీకి క్రేజ్ నెలకొంది. యూట్యూబ్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కూడా అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌పై విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. దేవర టీమ్‌కు దబిడి దిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.