ఆంధ్ర క్రికెటర్ మామిడి వంశీ కృష్ణ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది క్రికెట్‌లోనే అత్యంత అరుదైన ఫీట్ సాధించాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీ భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆంధ్ర ఓపెనర్‌గా బరిలోకి దిగిన మామిడి కృష్ణ ఈ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.
గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీ కృష్ణ.. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాది ఈ వరల్డ్ రికార్డు అందుకున్నాడు. ఇదే జోరులో 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత తరఫున యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత కీరన్ పోలార్డ్ టీ20ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో మాత్రంహెర్షల్ గిబ్స్(సౌతాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా(అమెరికా) ఈ అరుదైన ఫీట్ నమోదు చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు.
కడపలోని వైఎస్ రాజా రెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లకు 372 పరుగులు చేసింది. వంశీ కృష్ణ(64 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110) విధ్వంసకర శతకంతో చెలరేగగా... కెప్టెన్ వంశీ కృష్ణ(55), ధరణి కుమార్(81), వెంకట్ రాహుల్(61 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు.