క్రికెట్‌లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లు అధికారికంగా అభిమానులను అలరిస్తుంటే.. హండ్రెడ్ బాల్, టీ10, బ్యాక్‌యార్డ్/స్ట్రీట్ క్రికెట్, డబుల్ వికెట్ ఫార్మాట్‌లు అనధికారికంగా చలామణి అవుతున్నాయి. తాజాగా మరో క్రికెట్ ఫార్మాట్ పురుడు పోసుకునేందుకు సిద్దమైంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు మరింత ఆదరణ పెంచే యోచనలో భాగంగా ఈ సరికొత్త ఫార్మాట్‌ను రూపొందించారు.
టెస్ట్ మ్యాచ్‌ను టీ20 తరహాలో ఆడిస్తే ఎలా అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ సరికొత్త ఫార్మాట్. సాధారణంగా రెడ్ బాల్ క్రికెట్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లను ఐదో రోజుల పాటు ఆడుతారు. అయితే ఈ సరికొత్త ఫార్మాట్‌లో 80 ఓవర్లను నాలుగు ఇన్నింగ్స్‌లుగా విభజించి టీ20 ఫార్మాట్ తరహాలో ఆడించనున్నారు. ఇరు జట్లు రెండు సార్లు బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఫార్మాట్‌కు టెస్ట్-ట్వంటీ అని నామకరణం చేశారు. ఈ నయా ఫార్మాట్‌ను గురువారం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సర్ క్లైవ్ లాయిడ్ ఆవిష్కరించారు. ఈ ఫార్మాట్ సరికొత్తగా ఉంటుందని, ఈ ఛాంపియన్‌షిప్ తొలి రెండు ఎడిషన్స్ భారత్‌లోనే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి ఎడిషన్ జనవరి 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లోనే ఈ సరికొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడం సరైందిగా తాము భావించామని ఈ ఛాంపియన్‌షిప్ నిర్వాహకుడు గౌరవ్ బహీర్వాణి తెలిపారు. ఈ ఫార్మాట్‌ను సక్సెస్ చేసిన తర్వాత విదేశాలకు విస్తరిస్తామని చెప్పారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ ఫార్మాట్‌ను రూపొందించామని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఫార్మాట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుందంటుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్‌ను చంపడమేనని, ఈ ఫార్మాట్ రాకతో టెస్ట్ క్రికెట్ పూర్తి చచ్చిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఫార్మాట్‌కు సగం రెడ్, సగం వైట్ బాల్ ఉపయోగిస్తారా? అని సెటైర్లు పేల్చుతున్నారు. అయితే ఈ ఫార్మాట్‌కు ఐసీసీ కానీ.. క్రికెట్ దేశాల బోర్డుల ఆమోదం కానీ లేదు. సక్సెస్ అయితే భవిష్యత్తులో ఈ ఫార్మాట్‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు.