Temba Bavuma, SA vs AUS 2nd semi final: బ్యాటింగ్, బౌలింగ్‌ను పేలవంగా ఆరంభించడమే తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్లతో ఓటమిపాలైంది. మరోసారి ఫైనల్ చేరకుండానే చోకర్స్‌గా ఇంటిదారి పట్టింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బవుమా.. బ్యాటింగ్‌లో 20-30 పరుగులు అదనంగా చేసినా.. క్యాచ్‌లను పట్టినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. పేలవ బ్యాటింగ్‌కు తోడు బౌలింగ్‌లో తొలి 10 ఓవర్లలోనే ధారళంగా పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పిన బవుమా(Temba Bavuma).. ఏడుపు ఒక్కటే తక్కువని భావోద్వేగానికి గురయ్యాడు.

'ఈ ఓటమి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్‌కు ముందు వారికి బెస్టాఫ్ లక్. ఈ రోజు వాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. ఈ మ్యాచ్‌లో మేం ఓడినా చివరి వరకు పోరాడాం. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ఆరంభాలే మా ఓటమిని శాసించాయి.
పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేసిన ఆసీస్ పేసర్లు మాపై ఒత్తిడిని పెంచారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పోరాడే లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టం. కానీ మిల్లర్, క్లాసెన్ అద్భుత బ్యాటింగ్‌తో మాకు మూమెంటమ్ తీసుకొచ్చారు. కానీ కీలక సమయంలో క్లాసెన్ ఔటవ్వడం మా ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది.
మిల్లర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆసీస్ బ్యాటర్లు తొలి 10 ఓవర్లలోనే 70 పరుగులు చేయడం వారికి కలిసొచ్చింది. తర్వాతి బ్యాటర్లు రిలాక్స్‌గా ఆడుకునే అవకాశం దక్కింది. మార్క్‌రమ్, మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెట్టారు.
మాకు వచ్చిన కష్టతరమైన క్యాచ్‌లనైనా అందుకోవాల్సింది. ఆ క్యాచ్‌లను పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కోయిట్జీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మా పేసర్లు విఫలమైనా.. అతను అద్భుతంగా పోరాడాడు. అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టాడు. క్రాంప్స్ వచ్చినా జట్టు కోసం చివరి వరకు పోరాడాడు. క్వింటన్ డికాక్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా డికాక్ నిలిచిపోతాడు.'అని బవుమా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒక్కడే సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్(48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. జోష్ ఇంగ్లీస్, స్మిత్(30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో టబ్రైజ్ షంసీ(2/42) రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, ఎయిడెన్ మార్క్‌రమ్, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.